“టెక్ కాదు—టెర్రర్! “రష్మిక ఫైర్!”
ఈ మధ్య ప్రతి రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం భారీగా పెరుగుతోంది. వైద్యం నుంచి విద్య, వ్యవసాయం నుంచి వినోదం వరకు ఏ రంగాన్ని తీసుకున్నా AI ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ టెక్నాలజీతో చాలామంది మంచి ఫలితాలు సాధిస్తుండగా, కొందరు మాత్రం దాన్ని తప్పుదారిలో వాడుతున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీల ఫోటోలు, వీడియోలను అసభ్యకరంగా మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాంటి డీప్‌ఫేక్ వీడియోలు కేవలం వ్యక్తుల గౌరవాన్ని దెబ్బతీస్తూనే కాకుండా, సమాజంలో భయం, అవిశ్వాసం వ్యాప్తి చేస్తున్నాయి. మహిళలు ఎక్కువగా లక్ష్యంగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

తాజాగా రష్మిక మందన్నా కూడా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. మనుషులుగా ప్రవర్తించని వారికి తగిన శిక్షలు అమలు కావాలని కోరుతూ, ఎక్స్‌లో (X) ‘సైబర్ దోస్త్’ అకౌంట్‌ను ట్యాగ్ చేశారు. “ఏఐ అభివృద్ధికి గొప్ప సాధనం. కానీ దీనిని మహిళలపై దుర్వినియోగం చేయడం కొందరిలో ఉన్న నీతి లోపాన్ని చూపిస్తుంది. ఇంటర్నెట్ నిజ జీవిత ప్రతిబింబం కాదు; ఇది ఏదైనా మార్చగల కాన్వాస్ మాత్రమే. మంచి, గౌరవప్రద సమాజం కోసం ఏఐని సరైన మార్గంలో వాడుకుందాం. నిర్లక్ష్యం విడిచి, బాధ్యతగా వ్యవహరించాలి,” అని ఆమె సూచించారు.
ఇటీవలే కీర్తి సురేష్, గిరిజా ఓక్ తదితరులు కూడా AI దుర్వినియోగంపై పలు వ్యాఖ్యలు చేశారు. ఏఐ ఒకవైపు వరమైతే, మరోవైపు శాపంగా మారుతోందని కీర్తి ఆవేదన వ్యక్తం చేశారు. తన మార్ఫ్డ్ ఫోటోలు సోషల్ మీడియాలో చూసి తీవ్ర ఆవేదన చెందినట్లు తెలిపారు.

